వేసవికాలం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాలలో ఎండలు దంచికొడుతుండటంతో ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. అయితే గత కొద్ది రోజులుగా విద్యుత్ చార్జీలు పెంపుదలకు విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయని త్వరలోనే ఈ ప్రతిపాదనలను సీఎంకు ముందు ఉంచుతాయని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలపై TGSPDCL సీఎండీ ముషారప్ ఫారూఖీ స్పందించారు. ఈ ఏడాది విద్యుత్ చార్జీల పెంపునకు ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదని ఈరోజు విద్యుత్ నియంత్రణ భవన్లో ఈఆర్సీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన విచారణ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. TGPSC DCL ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరిగింది. సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ లు హాజరయ్యారు. విద్యుత్ చార్జీల పెంపు పై ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదని npdcl ప్రకటించిన విషయం తెలిసిందే.