సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కడికిపోయాయని ప్రశ్నించారు. అక్రమ కేసులతో కేటీఆర్‌ను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫార్ములా-ఈ రేసు
నిర్వహణకు ప్రపంచ దేశాలు పోటీపడతాయని చెప్పారు.
కేటీఆర్ ఎంతో కష్టపడి హైదరాబాద్ లో ఈ రేసు ను నిర్వహించారని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మీద పెట్టింది ఒక లొట్టపీసు కేసని, రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనను మరిపిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్రవులను అరెస్టు చేసి రాష్ట్రాన్ని దోచుకోవాలని రేవంత్ చూస్తున్నారని ఆరోపించారు.
సంజయ్ కుమార్ కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయాడని, అందుకే నీది ఏ పార్టీ అని అడిగానని చెప్పారు. మా బట్టలు విప్పుతామంటే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో లేకుంటే వార్డు మెంబర్ గా కూడా గెలవడంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కరీంనగర్ సమీక్ష సమావేశంలో మంత్రుల ఆదేశాల మేరకు ఎమ్మెల్యే
తనను అంతా బెదిరించారని చెప్పారు. కరీంనగర్ ఆర్డీవో
ఎవరో తనకు తెలియదని, ఆయన తనపై ఎలా కేసు
పెడతారని ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారే తనపై దాడి చేశాడన్నారు. సమావేశంలో తనది కాంగ్రెస్ పార్టీ అని అధికారుల సమక్షంలో చెప్పిన సంజయ్ కుమార్‌ను డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు లేవని, పీడీ యాక్ట్ ఎలా పెట్టాలని చూస్తున్నారని ప్రశ్నించారు. ఒకవేళ
పెట్టాలనుకుంటూ రేవంత్ రెడ్డితో మొదలు పెట్టాలన్నారు.