మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్ కి ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారని తెలిపారు. ఆర్థిక పరమైన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని క్యాట్ చెప్పిందన్నారు.
మెడిగడ్డ ప్రాజెక్టు డిజైన్ ఒకటైతే.. నిర్మాణం మరొక రకంగా చేయడంతో కుంగిపోయిందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణ మెటీరియల్ సక్రమంగా లేదని, నిర్వహణ కూడా లేదని డ్యాం సేఫ్టీ అధికారులు చెప్పారన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి కాలువల ద్వారా నీరుని తీసుకురాగలిగితే గతంలో ఖర్చు చేసిన నిధులకు సార్థకత దక్కుతుందన్నారు. తుమ్మిడిహెట్టి పరిశీలించాలని ప్రభుత్వం, కమిషన్ ను కోరినట్లు చెప్పారు. ఇంజనీర్ సూచనలను గత ప్రభుత్వం బేఖాతరు చేసిందని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు అవినీతి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణ కమిషన్ వేయాలని కోరిందే బీఆర్ఎస్, కమిషన్ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అసెంబ్లీలో బీఆర్ఎస్ కోరిందని వెల్లడించారు.