తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల 2024-25 ఫలితాలు మరికొన్ని గంటల్లోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం ఏప్రిల్ 22 మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలోని విద్యాభవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదగా ఇంటర్ ఫీలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య తాజాగా ఫలితాల విడుదల తేదీ, సమయం ఖరారు చేశారు.
మార్చి 05 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9.50 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు.. 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల అనంతరం మొత్తం 19 సెంటర్లల్లో మార్చి 19 నుంచి ప్రారంభమైన ఈ మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 10వ తేదీతో ముగిసింది. ప్రతి సెంటర్‌లో దాదాపు 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది మూల్యాంకన విధుల్లో పాల్గొని సకాలంలో మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేశారు.