మంచిర్యాల: భూవివాదంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, ఆయన కుమారుడు విజిత్ సహా 14 మందికి హై కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కింది కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్‌ను అమలు చేయడం లేదని జితేందర్ రావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. జితేందర్ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. హోం సెక్రటరీతో పాటు రామగుండం పోలీస్ కమీషనర్ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది.
కాగా ఎమ్మెల్యే దివాకర్ రావు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ సమయంలో గుడిపేటలో భూములను కబ్జా చేశారని, తండ్రి పేరుతో ప్రభుత్వ భూమినీ ఆక్రమించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇప్పటికీ భూదందాలు, కబ్జాలు, సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారనే ఆరోపణలనూ దివాకర్‌రావు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.
ఇక ఎమ్మెల్యే దివాకర్‌రావు భూకబ్జాలపై ఇటీవల కాలంలో మావోయిస్టులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే భూ దందాలు ఆపాలని మావోలు లేఖలు రాశారు. గుడిపేటలో 2004లో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం ముంపు గ్రామాల్లో ఉన్న తన అనుచరులు, అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయాలు కాజేశారని మావోయిస్టులు లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.