ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వే బిల్లులతో పాటు ఇసుక సరఫరా వాహనాలకు ట్రాకింగ్ ఉండాలని, అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వవద్దని ముఖ్యమంత్రి సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ పలు గనులపై గతంలో జరిమానాలు విధించారని, కేసులు నమోదు చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విధించిన జరిమానాలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు.
గతంలో జరిమానాలు విధించి తర్వాత వాటిని తగ్గించారని, అందుకు కారణాలు ఏమిటో తెలియజేయాలని, దానిపై నివేదిక సమర్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. టీఎస్ ఎండీసీతో పాటు గనుల శాఖలో పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల తరబడి తిష్ట వేశారని, కొందరిపై ఆరోపణలున్నాయని, వారిని వెంటనే బదిలీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష సందర్భంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.