ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన రాజకీయాల్లో చాలా చురుకుగా ఉంటారు. తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బిజెపిలో చేరారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీగా విజయం సాధించారు. నిత్యం రాజకీయాల్లో చురుకుగా ఉంటూ టిఆర్ఎస్ అధినేత కేసిఆర్, కేటీఆర్ పై పలు పలు విమర్శలు చేస్తుంటారు.

ఇటీవలే అధికార పార్టీ ఎమ్మెల్యే లను కూడా విమర్శించారు. ఇటీవల బీసీల కోసం పోరాడుతానని.. రేవంత్ రెడ్డి చివరి సీఎం అని.. ఆ తర్వాత బీసీ వ్యక్తి సీఎం గా ఉంటారని పేర్కొన్నారు. బీసీ సంఘం ఉద్యోగుల సమ్మేళనంలో మల్లన్న రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని రెడ్డి సంఘం నాయకులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు చేశారు. గౌరవప్రదమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. వెంటనే ఆయన పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.