ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

-

సూర్యాపేటలోని మానసనగర్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఓ చిన్నారి బాలిక సహా ముగ్గురు మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. 17 మంది ప్రయాణికులతో అర్వపల్లి నుంచి సూర్యాపేటకు వస్తున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. అదుపుతప్పిన ఆటో రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఈ ఘటనలో గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.  మిగిలిన ఏడుగురికి సూర్యాపేటలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని సూర్యాపేటకు చెందిన జాజిరెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు పుట్టా సరిత (41), లక్ష్మీతండాకు చెందిన లునావత్‌ రుక్కమ్మ (55), నాగారం మండలం పసునూరుకు చెందిన గొలుసు వేదస్విని (17 నెలలు)లుగా గుర్తించారు.  ఆటో డ్రైవర్‌ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నట్లు సూర్యాపేట డీఎస్పీ జి.రవి ప్రాథమికంగా నిర్ధరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version