అసెంబ్లీ సమావేశాలకు పటిష్ఠ భద్రత

-

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు గవర్నర్ తమిళిసై ప్రసంగంతో సమావేశాలు షురూ అవుతాయి. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉండగా, ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సమావేశాల్లో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతుండగా.. వాటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది.

మరోవైపు రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలకు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సమావేశాల్లో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా భద్రత ఏర్పాట్లు చేయాలని సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు అధికారులను ఆదేశించారు. సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీల అనుమతి విషయంలో ఆచితూచి చర్యలు చేపట్టాలని సూచించారు. బుధవారం శాసనసభ, మండలి సమావేశాల ఏర్పాట్లపై వారు సమీక్ష నిర్వహించారు. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, శాసనమండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాశ్‌, సీఎస్‌ శాంతికుమారి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, డీజీపీ రవిగుప్తా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  కొత్త సభ్యుల కోసం సమావేశాల తర్వాత రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version