టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. A 29 నిందితుడుగా నవదీప్

తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మురంగా కొనసాగుతుంది. ఇప్పటికే అరెస్టు అయిన ముగ్గురు నైజీరియన్లు సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్ కి తరలించారు. ఈ కేసులోని రిమాండ్ రిపోర్టులోని పలు విషయాలను పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా టాలీవుడ్ నటుడు నవదీప్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. అతనికి డ్రగ్స్ ముఠాతో సంబంధం ఉన్నట్టు రిపోర్టులో వెల్లడించారు.

గత నెల 31న వెంకటరత్నాకర్ రెడ్డి, బాలాజీ, మురళి ఇచ్చిన సమాచారం ఆధారంగా మెహిదీపట్నం బస్ స్టాప్ లో ముగ్గురు నైజీరియన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మత్తు పదార్థాలతో పాటు ఎస్టపీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే నటుడు నవదీప్ ను కేసులో 29వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. నిందితులు తరచూ హైదరాబాద లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించే వారు అని రిమాండ్ రిపోర్టులో వెల్లడి అయింది.విశాఖపట్టణంకి చెందిన రామ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవారని పేర్కొన్నారు. మరోవైపు నటుడు నవదీప్ కి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.