కామారెడ్డి బరిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి?

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. అయితే ఈసారి సీఎం కేసీఆర్​ను ఎలాగైనా ఓడించాలని ఓవైపు కాంగ్రెస్.. మరోవైపు బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ పోటీచేసే గజ్వేల్ నుంచి బీజేపీ నుంచి ఈటల పోటీకి దిగనున్నట్లు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి గజ్వేల్​కు పోటీ ఇస్తానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డి నియోజకవర్గంలోనూ ముఖ్యమంత్రికి బీజేపీ, కాంగ్రెస్ నుంచి పోటీ ఎదురవనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు సమాచారం. కొడంగల్‌ నుంచి రేవంత్‌ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో రేవంత్‌ను కూడా కొడంగల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేయించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కామారెడ్డి నుంచి టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించగా.. తాజా నిర్ణయం నేపథ్యంలో షబ్బీర్‌అలీకి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ తరఫున ప్రచార బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిసింది. మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version