మహబూబ్‌నగర్ జిల్లాలో తన పర్యటన సమయంలో కరెంట్ కోతలు ఉన్నాయన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్వీట్‌పై టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ స్పందించింది. ఆ రోజు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగలేదని స్పష్టం చేసింది. మాజీ శాసనసభ్యులు ఇంటి చుట్టుపక్కల విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టారని ఓ ప్రకటన విడుదల చేసింది. స్థానికులు అడగగా విద్యుత్ అంతరాయం అవ్వలేదని చెప్పారని వివరించింది. ఒకవేళ పవర్ కట్ జరిగితే సబ్ స్టేషన్ ట్రాన్స్ ఫార్మర్స్ రికార్డులలో నమోదు చేస్తామని , కానీ అసలు కేసీఆర్ మహబూబ్‌నగర్ పర్యటనలో కరెంట్ కోతే జరగలేదని విద్యుత్ శాఖ వెల్లడించింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా రెండురోజుల క్రితం మహబూబ్‌నగర్ లో పర్యటించిన సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి ట్వీట్ చేశారు. అందులో తెలంగాణలో చాలా చిత్రవిచిత్రమైన ఘటనలు జరుగున్నాయని తెలిపారు. తాను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనానికి వెళ్లారని పేర్కొన్నారు. వారు తినేటప్పుడు రెండు సార్లు కరెంట్ పోయిందన్నారు.