కాంగ్రెస్ తొలి జాబితాలో పొంగులేటి, తుమ్మలకు నో ఛాన్స్

-

తెలంగాణలో 55 మందితో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ రావులకు సీటు దక్కింది. కానీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​లకు మాత్రం చోటు లభించలేదు. ఖమ్మం నుంచి తుమ్మలకు, పాలేరు సీటు పొంగులేటికి ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ స్థానాలపై హైకమాండ్ ఇంకా స్పష్టతకు రాకపోవడం.. మరోవైపు పాలేరు సీటు తమకు ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతుండటం వల్ల ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు.

మరోవైపు వామపక్షాలతో కాంగ్రెస్‌ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగూడెం, చెన్నూర్‌ సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించగా.. చెన్నూర్‌ బదులు బెల్లంపల్లి ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు పాలేరు, మిర్యాలగూడ ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 55 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. వామపక్షాల సీట్లు ఖరారు చేసి.. మిగతా స్థానాల్లో స్పష్టత వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయనుందని పీసీసీ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news