బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ (అలియాస్ సాహిల్)కు మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది. పంజాగుట్ట ఠాణా పరిధిలోని అప్పటి సీఏం క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకవుట్ సర్క్యులర్ జారీ అయ్యాయి. అయితే మరో రోడ్డుప్రమాద ఘటనలో అతడి ప్రమేయముందనే అనుమానంతో పోలీసులు కేసును రీఓపెన్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్‌నం.45 ప్రాంతంలో 2022 మార్చి 17న జరిగిన రోడ్డుప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటనకు సంబంధించిన కేసులో దర్యాప్తును తిరిగి ప్రారంభించారు.
ఆరోజు దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జి వైపు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన థార్ వాహనం రాత్రి 8 గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టగా.. ముగ్గురు మహిళలు గాయపడగా అందులోని ఓ మహిళ చేతిలోని రెండునెలల బాలుడు మృతి చెందాడు. ఆ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో ఆరా తీయగా బోధన్ ఎమ్మెల్యే వాహనంగా తేలింది ఆ కారులో తన తనయుడు రాహిల్ లేడని షకీల్ తెలిపారు. అయితే ఆ కారులో రాహిల్ కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తేలడంతో కేసు మలుపు తిరిగింది. ఇటీవలే మరో రోడ్డుప్రమాదంలో రాహిల్ భాగమవ్వడంతో పాత కేసును తిరిగి దర్యాప్తు చేయాలని పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.