చిమ్మ‌చీక‌ట్లో తుపాకుల మోత‌..ఏం జ‌రిగిందంటే..?

ద‌ట్ట‌మైన అడ‌వి.. చిమ్మ‌చీక‌టి.. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుమురంభీం– ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కదంబా అటవీ ప్రాంతం కాల్పుల మోత‌తో ద‌ద్ద‌రిల్లింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. ఈ ద‌ట్ట‌మైన అడ‌వి పులులకు ఆవాసం. అలాంటి ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం. రాత్రివేళ కావడం, భారీ వర్షం కురుస్తుండటంతో మృతదేహాల గుర్తింపు ఆలస్యమవు తోంది. మృతుల్లో కీల‌క నాయ‌కుడు వర్గీస్‌ ఉన్నట్లు ప్రాథమి కంగా నిర్ధారణ అవుతోంది. వర్గీస్‌ ఇటీవలి నియామకాల్లో ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి ఏరియా కమిటీ సారథిగా నియమితులయ్యారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయనపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది.

చనిపోయిన మరొకరు మహిళా మావోయిస్టు అని తెలుస్తోంది. మరో ఇద్దరు కూడా మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఏకే 47 స్వాధీన పర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ తప్పించుకున్నట్లు స‌మాచారం. పోలీసుల‌ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 25 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న భాస్కర్‌ తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. కుమురం భీం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ, రామగుండం పోలీసు కమిషనర్‌ వి.సత్యనారా యణ, ఏఎస్పీ సుధీంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మొత్తం ఎనిమిది గ్రేహౌండ్స్‌ బృందాలు, ఆరు స్పెషల్‌ పార్టీలు పాల్గొన్నాయి.