దేశ ప్రగతిలో మనమంతా భాగస్వాములు కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు దూసుకుపోవాలిని ఆకాంక్షించారు. ఉగాది వేళ ప్రజలంతా కొత్త సంకల్పం తీసుకోవాలని సూచించారు. భారత్‌ను సూపర్ పవర్‌గా మార్చేందుకు కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో స్వర్ణభారతి ట్రస్టు ఆధ్వర్యంలో వెంకయ్య నాయుడు ఉగాది వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందని అన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలి, ప్రకృతితో కలిసి జీవించాలని కోరారు. ప్రభుత్వ సాయం పేదలకు నేరుగా అందేలా కేంద్రం సంస్కరణలు తెచ్చిందని తెలిపారు. దళారులు లేకుండా పేద కుటుంబాలకు సాయం అందుతోందన్న వెంకయ్య నాయుడు.. పదేళ్లుగా 7 శాతం వరకు వృద్ధి రేటు సాధిస్తున్నామని చెప్పారు. మనదేశం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని, దేశ ప్రగతిలో మనమంతా భాగస్వాములు కావాలని సూచించారు. అందరూ సుఖశాంతులతో, సంతోషంగా ఉంటేనే దేశాభివృద్ధి అని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.