కేసీఆర్ పాపం పండే రోజు దగ్గర్లోనే ఉందని బీజేపీ నేత విజయ శాంతి సంచలన పోస్ట్ పెట్టారు. తెలంగాణలో గులాబీ నేతల భూకబ్జాలు, ఆక్రమణలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో రామాలయానికి చెందిన భూముల్ని కోర్టు నిర్ణయాన్ని కూడా లెక్కచెయ్యకుండా ప్రభుత్వమే లాక్కుంటున్న తీరు దారుణంగా ఉందని పేర్కొన్నారు.
ఆ రామాలయం కోసం భక్తులు సమర్పించిన సుమారు 11 వందల ఎకరాలకు పైగా భూమిని చట్టంలోని నిబంధనలకు భిన్నంగా, కోర్టు అనుమతి లేకున్నా, ప్రజలు వ్యతిరేకిస్తున్నా పారిశ్రామిక పార్క్ కోసం సేకరించి అప్పగించడం చూస్తుంటే ప్రభుత్వం ఉన్నది ప్రజల ఆస్తుల సంరక్షణ కోసమా లేక అధికార గణానికి అండగా ఉండేందుకా అనేది అర్థం కావడం లేదని వివరించారు.
చివరికి ఆ సేకరించిన భూమికి పరిహారం చెల్లింపులో సైతం నిబంధనల్ని ఉల్లంఘించిన సర్కారు తీరుపై మీడియాలో వచ్చిన కథనం చూస్తే సీఎం కేసీఆర్ గారు చేసే పూజలు, యాగాలు కేవలం బూటకపు వ్యవహారం తప్ప దేవుడి పట్ల ఎలాంటి గౌరవం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. కంటితుడుపు చర్యగా మాత్రమే దేవుళ్ల పేరెత్తే కేసీఆర్ గారి సర్కారు పాపం పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు విజయశాంతి.