కవిత అరెస్ట్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత గారిని అరెస్టు చేయనందువల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న సంకేతం వెళుతున్నదని… తమ్ముడు సంజయ్ గారిని మార్చడం బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర అనీ… అందుకే కాంగ్రెస్ గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది, బీజేపీ తగ్గుతున్నదనే ప్రచారం చేస్తున్న బీజేపీ వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేక మీడియా గమనించివలసింది కూడా ఒకటున్నదని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అయితే ఆ వ్యతిరేక ప్రత్యేక ఓటు బీఆర్ఎస్‌కు కూడా వ్యతిరేకమై కేసీఆర్ గారి ఓటమికి పనిచేస్తాది కదా?… అట్లయితే, కవిత గారి అరెస్టు అందరికన్నా అత్యంత అవసరం కేసిఆర్ గారికే కదా… మరి బీఆర్ఎస్ అందుకోసం డిమాండ్ చేస్తదా? అని వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ విచారణ జరిగినప్పుడు అంత ఆత్రంగా కవితతో పాటు మందీ మార్బలాన్ని ఢిల్లీ పంపడం సానుభూతి కోసం ఆడిన డ్రామానా? బీఆరెస్, బీజేపీ ఒక్కటే అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? బట్ట కాల్చి బీజేపీ మీదేసి దెబ్బ తీస్తాం… వదిలించుకొని బయట పడాల్సింది బీజేపీయే అనే దుర్మార్గాన్ని తన అనుకూల మీడియా ద్వారా కేసిఆర్ గారు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే బీఆరెస్‌కి నష్టం… అదే కాంగ్రెస్ కు కొంచెం ఎక్కువ వస్తే బీఆరెస్‌కి మేలు అని చెప్పడానికి గత ఎన్నికలప్పుడు చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం. మళ్లీ అలాగే జరగాలని గులాబీ అధినేత కోరుకుంటున్నరు. అందుకే ఈ కుట్రలకు తెరలేపారు. ఒకవైపు మళ్లీ అధికారం తమదేనని చెప్పుకుంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీఆరెస్ అధిపతికి ఈ వంచనలెందుకు? గెలుపుపై అంత ధీమా ఉన్నప్పుడు ఈ మోసాలెందుకు? అని నిలదీశారు విజయశాంతి.