నిజామాబాద్ జిల్లాలో బిజెపికి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో ఆర్మూర్ నుండి పోటీ చేసిన వినయ్ రెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పై ఓడిపోయారు. అప్పటినుండి పార్టీలో యాక్టివ్ గా ఉన్న వినయ్ రెడ్డి సోమవారం రోజు అకస్మాత్తుగా బిజెపికి రాజీనామా చేశారు. బిజెపి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకుంటున్నట్లు ఆయన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాసిన రాజీనామా లేఖలో వెల్లడించారు.
తన రాజీనామాకు ఎంపీ అరవింద్ కారణమని లేఖలో పేర్కొన్నారు వినయ్ రెడ్డి. తాజాగా కాంగ్రెస్ అగ్ర నేతలకు టచ్ లోకి వెళ్లారు వినయ్ రెడ్డి. ఈనెల 18న ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎంపీ అరవింద్ ఈసారి ఆర్మూరు నుండి పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే వినయ్ రెడ్డి బిజెపికి రాజీనామా చేశారనే టాక్ కూడా పార్టీలో వినిపిస్తోంది.