తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలోని వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల నమోదు నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటివరకు 2.60 లక్షల మంది పట్టభద్రులు మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. గడిచిన ఎన్నికల్లో సుమారు 6.50 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారని వెల్లడించారు. గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ప్రాతినిధ్యం వహించగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో మండలి స్థానానికి రాజీనామా చేశారు.
పల్లా రాజీనామాతో ఆ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఒక దఫా ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితా తిరిగి వినియోగించకూడదన్నది ఎన్నికల సంఘం నిబంధన. దీంతో మండలి ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టింది. కానీ ఓటర్ల నుంచి అంతగా స్పందన కనిపించడం లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 4న తుది జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.