తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళయింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని ప్రకటించింది. ఇక మంత్రివర్గ కూర్పుపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ నేతల్లో అమాత్య పదవికి ఎవరిని వర్తిస్తుందో.. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. అయితే ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ మంత్రులకు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా ఈ జిల్లా నుంచి కీలక నేత మల్లు భట్టివిక్రమార్కకు మంత్రివర్గంలో సముచితస్థానం దక్కనుందట. త్వరలో కొలువుదీరబోయే మంత్రివర్గంలో విక్రమార్కకు కీలక పదవి దక్కే అవకాశాలున్నాయి. ప్రభుత్వంలో అత్యున్నతమైన రెండో పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకుని గెలుపొందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కొత్త మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తుమ్మల.. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించిన విషయం
ఇదే జిల్లా నుంచి మరో కీలక నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా మంత్రి పదవికి పోటీ పడుతున్నారు. ఆయన కూడా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించటం, ఉభయ జిల్లాల్లో తన అనుచరులందరినీ గెలుపించుకోవటం వంటి లక్షణాలుండటంతో ఆయనకు కూడా మంత్రి పదవి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ జిల్లా నుంచి ముగ్గురుకి అమాత్య పదవి వస్తుందా లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.