బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరరావు భేటీ అయ్యారు. కేకే పార్టీ మారబోతున్నారంటూ వార్తలు విస్తృతం కావడంతో అప్రమత్తమైన కేసీఆర్.. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి పిలుపించుకున్నారు. కేకేతో పాటు ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ఉన్నారు.
ఇటీవల కేశవరావు ఇంటికి ఏఐసీసీ సెక్రటరీ దీపాదాస్ మున్షీ వచ్చి కేకే, కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలని వారిని మున్షీ ఆహ్వానించారు. దీంతో వీరు పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరిగింది. మొత్తానికి అది నిజం చేస్తూ.. ఈనెల 30న హస్తం పార్టీ కండువాను కప్పుకుంటారని సమాచారం. కేకేతో పాటు ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ మారేందుకు కేసీఆర్ అనుమతి తీసుకునేందుకే కేకే ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది.