తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంక కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలను తిరిగి ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించనుండగా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
సోమ, మంగళవారాల్లో శ్వేత పత్రాలను రూపొందించి, బుధవారం విడుదల చేస్తారని తెలుస్తోంది. దీనిపై బుధ, గురువారాల్లో సభలో చర్చించనుంది. నిన్న అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చల అనంతరం సభ బుధవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
కాగా, మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని గుత్తేదారు సంస్థ ఎల్‌అండ్‌టీ చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు ఆ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై సందిగ్ధం నెలకొంది. వచ్చే ఏడాది వర్షాకాలంలోగా పనుల పూర్తి కష్టమేనని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పనులు పూర్తి చేయకుండా నీటిని నిల్వచేస్తే బ్యారేజీకి ప్రమాదం వాటిల్లే అవకాశముందని ఇప్పటికే నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ హెచ్చరించింది.