తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. ఇక ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ కసరత్తు చేస్తోంది. ఎలక్షన్ కోడ్ అణల్లోకి వచ్చినందుకు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు ఓటరు నమోదు ప్రక్రియపైనా దృష్టి సారించారు. అయితే రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వాటిలో 13 చోట్ల మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాల్లో మహిళలదే పైచేయిగా ఉంది.
రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలలో నిజామాబాద్‌లో పురుషుల కన్నా 90,953 మంది అధికంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 3,30,21,735 మంది ఓటర్లు నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మహిళలు 1,65,87,221 మంది, పురుషులు 1,64,31,777, థర్డ్ జండర్ ఓటర్లు 2,737 మంది నమోదయ్యారు. పురుష ఓటర్ల కన్నా మహిళలు 1,55,444 మంది ఎక్కువగా ఉన్నారు. మే నెల 13వ తేదీన జరిగే పోలింగ్ సమయానికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.