గజ్వేల్ నియోజకవర్గ పర్యటనకు బయల్దేరిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తన పర్యటనను అడ్డుకోవడంతో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆమె లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఇవాళ గజ్వేల్‌లోని తీగుల్‌కు వెళ్లే వరకు దీక్షను విరమించనని భీష్మించుకు కూర్చున్నారు.
ఈ నేపథ్యంలోనే షర్మిల మాట్లాడుతూ.. దళితబంధు అమలు తీరుపై తీగుల్ ప్రజలు లేఖ రాశారు. తమ తరఫున వచ్చి పోరాడమని తీగుల్ ప్రజలు లేఖలో పేర్కొన్నారు. తీగుల్‌లో పరిస్థితులను తెలుసుకోవడానికి వెళ్తున్నా. తీగుల్ వెళ్లేందుకు ప్రయత్నించగా గృహనిర్బంధం చేశారు. దాడులు చేయడానికి మేము తీగుల్ వెళ్లడం లేదు. ప్రజల తరఫున పోరాటం చేసేందుకే వెళ్తున్నాం. తమను అడుగు పెట్టనివ్వమన్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారా? ప్రజల తరఫున పోరాటం చేస్తున్న వారిని అరెస్టు చేస్తారా? ప్రజల తరఫున నిలబడే వాళ్ల కోసం పోలీసులు పని చేయాలి. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే దళితబంధు సరిగ్గా అమలు కావట్లేదు. మిగతా ప్రాంతాల్లో దళితబంధు పరిస్థితి ఏమిటి? అని షర్మిల ప్రశ్నించారు.