కరోనా వైరస్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న మొబైల్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ వినియోగదారుల ప్రీపెయిడ్ ప్లాన్లకు గాను వాలిడిటీని పెంచడంతోపాటు.. ఉచితంగా టాక్‌టైంను కూడా అందిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల ప్లాన్ల వాలిడిటీని ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే ప్లాన్లు ఎక్స్‌పైర్ అయినప్పటికీ వాటి వాలిడిటీ ఏప్రిల్ 20వ తేదీ వరకు ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇక సదరు వినియోగదారులకు ఉచితంగా రూ.10 టాక్‌టైం ఇస్తున్నట్లు కూడా బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
అలాగే వొడాఫోన్ ఐడియా తన ప్రీపెయిడ్ వినియోగదారుల ప్లాన్ల వాలిడిటీని ఏప్రిల్ 17వ తేదీ వరకు పొడిగించింది. ఈ క్రమంలో ఈ సంస్థ కూడా రూ.10 టాక్‌టైంను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఎయిర్‌టెల్ కూడా తన ప్రీపెయిడ్ వినియోగదారుల ప్లాన్ల వాలిడిటీని ఏప్రిల్ 17వ తేదీ వరకు పొడిగించి.. రూ.10 ఉచిత టాక్‌టైంను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక జియో తన జియో ఫోన్ యూజర్ల ప్లాన్ల వాలిడిటీని ఏప్రిల్ 17వ తేదీ వరకు పెంచింది. వారికి 100 ఉచిత నిమిషాలు, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను అందిస్తున్నట్లు ప్రకటించింది.
కాగా ఈ టెలికాం కంపెనీలన్నీ.. తమ ప్రీపెయిడ్ వినియోగదారుల ప్లాన్లు ఎక్స్‌పైర్ అయినప్పటికీ ఉచితంగానే ఇన్‌కమింగ్ కాల్స్‌ను అందిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో దేశంలో ఉన్న ఎంతో మంది ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ఈ ఆఫర్లు ఉపయోగపడనున్నాయి.