అలవాటైన అవకాశవాదం అని సరిపెట్టుకున్నారో లేక మనం రాసే అక్షరాలే కదా తిరిగి ప్రశ్నించవని సర్ధుకున్నారో కానీ… రెండు రకాల వ్యాఖ్యానాలు ఒకేసారి ఒకే విషయం చేసేస్తున్నారు నేటి జర్నలిస్టుల్లో కొందరు! ఈ విషయంలో తాజా ఉదాహరణగా నిలిచింది ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన ఒక కథనం! కరోనా స్టార్ట్ అయినప్పటినుంచీ… ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతుందని, కరోనా విషయంలో సహజీవనం చేయాలని జగన్ చెప్పడం తప్పన్నట్లుగా, పెరుగుతున్న టెస్టుల సంఖ్య పక్కన పెట్టి కేసులు సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని.. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని.. ఇలా ఏపీలో కరోనా పై రకరకాల కథనాలు వండి వడ్డించేసిన “ఆ పత్రిక”… తాజాగా ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని చెప్పుకొచ్చింది!
ఇది నిజమేనా అని ఆశ్చర్యపోయిన సగటు పాఠకుడు… జగన్ సర్కార్ కు “ఆ పత్రిక” బాసటగా నిలిచిందా? వాస్తవాలు అర్ధం చేసుకుని రాయడం మొదలుపెట్టిందా? అని ఆలోచించేలోపు… అసలు విషయం అర్ధం అయ్యింది! ఇంతకీ “ఆ పత్రిక” ఉద్దేశ్యం ఏపీలో కరోనా రోజు రోజుకీ పెరుగుతుందనే! రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోందని… తాజాగా 66 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని… దీంతో మొత్తం పాజిటివ్ ల సంఖ్య 2,627కు చేరిందని.. ఇప్పటివరకూ వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,807కు చేరిందని.. మరో 764మంది చికిత్స పొందుతున్నారని చెప్పుకొచ్చింది. ఈ లెక్కంతా… ఏపీలో “తగ్గని కరోనా ఉధృతి” అన్నదే వారి ఉద్దేశ్యం! కాకపోతే అది జనాలకు సంబందించిన విషయంలో! మరి జగన్ సర్కారుకు బాసటగా ఎలా అంటే… ఏపీలో కరోనా ఉధృతి అంతగా లేదు అని మరో కథనం… అది కూడా సేం డేట్.. సేం పేపర్!!
అదెలా అంటే… బాబు విశాఖ పర్యటన రద్దు అనే వార్తకు సంబందించి… మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది, తమిళనాట కూడా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దీంతో సోమవారం నుంచి విమానాల రాకపోకలను అనుమతించేదిలేదని ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో (ఏపీలో) కరోనా ఉధృతి తీవ్రంగా లేదు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం ఎందుకు విమానాల రాకపోకలను వాయిదా వేయాలి అని ప్రశ్నిస్తున్నట్లుగా మరో కథనం!! అంటే… బాబు విశాఖ పర్యటన ఒకరోజు రద్దయ్యే సరికి… ఏపీలో కరోనా అంతగా లేదు అని ప్లేట్ ఫిరాయించేసిందన్నమాట! ఇంతకు మించి అవకాశవాద జర్నలిజం మరొకటి ఉంటుందా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఇంతకూ “ఆ పత్రిక” దృష్టిలో… ఏపీలో కరోనా ఉధృతి తగ్గినట్లా… తగ్గనట్లా? ఏపీలో కరోనా తీవ్రంగా ఉన్నట్లా… లేనట్లా?