ఆర్టీసీ అద్దె బస్సులను పెంచుతామని సర్కారు ప్రకటించిన మేరకు.. టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది. ఏకంగా 1035 అద్దె బస్సులను తీసుకోవడానికి షెడ్యూలును ప్రకటించింది. ఆర్టీసీ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పెట్టారు. ఈనెల 21 మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్లకు గడువు విధించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు ఓపెన్ చేసి సెలక్షన్ కమిటీ ఖరారు చేయనుంది. ఇందులో 760 బస్సులు జీహెచ్ఎంసీ పరిధిలో తిరగనున్నాయి. ఇప్పటికే ఆర్టీసీలో 2100 అద్దె బస్సులున్నాయి. తాజా బస్సులతో కలిపి మొత్తం 3,135 అద్దె బస్సులు తిరగనున్నాయి.
ఈ నెల 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంలో చర్చలు జరపాలని హైకోర్టు సూచించింది. అలాగే యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు పేర్కొంది. కార్మికులకు సోమవారంలోగా జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రక్షాళన దిశగా అడుగు పడింది. కొత్తగా మరికొన్ని బస్సులను తీసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేసింది.