మాదాపూర్ ఐటీసీ కోహినూర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫుట్‌పాత్ వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎటువంటి సమాచారం లేకుండా రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తమ సామగ్రిని తీసుకెళ్లారని వారు ఆరోపిస్తున్నారు.రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలో హోటల్ కోహినూర్‌కు ఎదురుగా గత కొంతకాలంగా ఫుట్‌పాత్‌పై పదుల సంఖ్యలో ఫుడ్ స్టాల్స్ ఇతర దుకాణాలు వెలిశాయి.దీంతో ఆ ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అయితే, ఫుట్‌పాత్‌పై దుకాణాలు తొలగించాలని ట్రాఫిక్ సిబ్బంది నోటీసులు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.
అక్కడికి వచ్చే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నా రోడ్లపైనే వాహనాలను నిలుపుతున్నారు.దీంతో బుధవారం ఉదయం టీఎస్ఐఐసీ అధికారులు ట్రాఫిక్ పోలీసుల సాయంతో కోహినూర్ హోటల్ వద్ద ఫుట్ పాత్ పై వెలసిన దుకాణాలను తొలగించి, సామగ్రిని అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు.దీంతో వీధి వ్యాపారులు ఆందోళనకు దిగారు.తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.