హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజకీయనేతలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే.. బోనాల పండుగ సందర్భంగా నృత్యం చేస్తూ.. బోనాలతో ఆలయం వద్దకు వస్తున్న భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసుల వ్యవహార శైలిపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం ఉదయం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని అమ్మవార్లకు నైవేథ్యం సమర్పించారు.
పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ బోనాల పండుగ అని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఏటా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని స్వయంగా మంత్రి చెప్పిన కొన్ని గంటల్లోనే భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై పోలీసులు, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.