సరిహద్దుల్లో మళ్ళీ అలజడి చెలరేగే అవకాశం ఉందా…? అంటే అవుననే అంటున్నాయి భారత నిఘా వర్గాలు. వచ్చే వారం ఉగ్రవాదులు సరిహద్దుల్లో భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందనే విషయాన్ని నిఘా వర్గాలు స్పష్టం చేసాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగి ఫిబ్రవరి 14వతేదీ నాటికి ఏడాది అవుతుంది.
ఈ నేపధ్యంలోనే మరోసారి సరిహద్దుల్లో ఉగ్రవాద దాడులకు సిద్దమవుతున్నారని భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. జైషే మహ్మద్‌కు చెందిన 27 మంది పాక్ ఉగ్రవాదులు బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరంలో శిక్షణ పొందారని, వాళ్ళు అందరూ భారత్ లోకి చొరబడి దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
కీలక ఉగ్రవాది మసూద్ అజహర్ కుమారుడు యూసుఫ్ అజహర్ బాలాకోట్ లోని 27 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారని నిఘా వర్గాలు గుర్తించాయి. వారిలో పాకిస్తాన్ లోని పంజాబ్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని నిఘా వర్గాలు చెప్పాయి. బ్యాట్ దళాల సహకారంతో వాళ్ళు భారత్ లోకి చొరబడే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనితో భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది.