సీఎం జగన్ ఇచ్చిన వరుస క్లాసుల ప్రభావమో.. లేక.. స్థానికంగా ఆయనకు ఎదురైన అనుభవమో.. మొత్తాని కి మంత్రి శ్రీరంగనాథరాజు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న రాజు.. పశ్చిమలోని చాలా నియోజకవర్గాల్లో తన హవా ప్రదర్శించారు. అదేసమయంలో తనకు ఇష్టమైన.. పౌర సరఫరాల శాఖలోనూ వేలు పెట్టారు. రాజుల వర్గంలో తనకు అనుకూలంగా ఉన్నవారిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని పనిగట్టుకుని ప్రారంభించారు. ఇక, ఆయన అల్లుడి గారిది మరో రాజకీయం.
వెరసి.. రెండు మూడు మాసాల కిందటి వరకు కూడా రంగనాథరాజు.. ఓ వివాదాస్పద మంత్రిగానే పేరు తెచ్చుకున్నారు. ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. దీంతో రెండు సార్లు కేబినెట్ సమావేశాల్లో సీఎం జగన్ స్వయంగా ఆయనను హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన వైఖరి మారిందని.. నియోజక వర్గాల్లో ఇప్పుడు ఆయన జోక్యం తగ్గిందని అంటున్నారు. అంతేకాదు.. తన పనేదో తాను చేసుకుని పోతు న్నారని చెబుతున్నారు. అయితే.. మంత్రి మారినా.. ఆయన వేసిన అడుగుల తాలూకు మరకలు మాత్రం మారడం లేదు. దీంతో రాజకీయంగా మంత్రి వైఖరిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
కొందరు నాయకులు మంత్రిని నమ్ముకుని.. కొన్ని వ్యాపారాలు ప్రారంభించారు. వీటిని మధ్యలోనే వదిలేశారు మంత్రి. తమకు సాయం చేస్తామని చెప్పి.. చేయకుండా ఇప్పుడు తనకు సంబంధం లేదని అనడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, తన నియోజకవర్గంలో మాత్రమే మంత్రి ఎక్కువగా పర్యటిస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు ఇతర నియోజకవర్గాల విషయంలోనూ ఆయన చక్రం తిప్పడంతో అక్కడి నుంచి కూడా ప్రజలు మంత్రి దగ్గరకే వస్తున్నారు.
నాకు సంబంధం లేదు.. మీ నియోకవర్గంలోనే తేల్చుకోండి అని మంత్రి చెబుతున్నా.. నిన్న మొన్నటి వరకు మీరే కదా చక్రం తిప్పారు! అంటూ ఎదురు ప్రశ్నిస్తుండడంతో మంత్రిగారికి ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. మొత్తానికి తాను మారినా.. తన చుట్టూ ఉన్న పరిస్థితులు మారకపోవడంతో మంత్రి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.