నమ్మకం.. అదొక్కటే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. తమ మీద తమకి నమ్మకం ఉంటే ఎవరెస్ట్ ఎక్కగలరు. అదే నమ్మకం లేకపోతే ఏడు అడుగులు కూడా వేయలేరు. ముందు నిన్ను నువ్వు నమ్మాలి. ఏది చేయాలన్నా, ఏది కావాలనుకున్నా, ఏది గెలవాలనుకున్నా నీ మీద నువ్వు నమ్మకం పెంచుకోవాలి. ఇప్పుడున్న గొప్పవాళ్ళందరూ అలా కావడానికి కారణం వారి మీద వారికున్న నమ్మకమే. నీలో లేనిదేదో వారిలో ఉన్నదని, వారి నేపథ్యం వేరు, నీది వేరని పారిపోవాలనే ప్రయత్నం చేయకు. నమ్మకం పెంచుకో.
ఆ నమ్మకం మీలో రావడానికి ప్రపంచంలో లేని ఏవో కొత్త అలవాట్లు ఉండాలని భ్రమ పడవద్దు. సాధారణ అలవాట్లే మీలో నమ్మకాన్ని పెంచుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
డ్రెస్సింగ్
మీరు నమ్మినా నమ్మకపోయినా మంచి డ్రెస్సింగ్ సెన్స్ మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మంచి డ్రెస్సింగ్ అనగానే ఖరీదైన బట్టలే అని అనుకోవద్దు. మీకు నప్పేట్టుగా ఉన్న డ్రెస్సింగ్ ఏదైనా సరే, అది వేసుకోగానే మీలో తెలియని నమ్మకం వచ్చేస్తుంది.
మీకు మీరే బహుమతి ఇచ్చుకోండి.
ప్రస్తుత ప్రపంచంలో అవతలి వారిని మెచ్చుకోవడం చాలా తక్కువ. ఒకవేళ అలా పొగిడిన దానివల్ల తమకేదో లాభం రావాలని అనుకునేవారే. అందువల్ల నిజమైన మెచ్చుకోలు కనుమరుగైపోయింది. అందుకే మిమ్మల్ని మీరే అభినందించుకోవాలి. ఏ చిన్న పనైనా మీలా చేసినట్టు మరొకరు చేయకపోవచ్చు. అందుకే మిమ్మల్ని మీరు అభినందించుకోండి.
ఇతరులు ఏమనుకుంటారో అని అస్సలు ఆలోచించవద్దు.
మీ గురించి వాళ్ళకేం తెలుసు ఏదో అనుకోవడానికి. మీరు పడుతున్న కష్టాలు, బాధలు వారికి అనవసరం. వాళ్లేమనుకుంటారో అని ఆలోచించవద్దు. మీ దగ్గర ఏమీ లేనపుడు మీ దగ్గరికి కూడా రాని వాళ్ళు ఏమనుకుంటే మీకేంటి. ఇది మీ జీవితం. మీ జీవితాన్ని నిర్ణయించడానికి వాళ్ళెవరు.
ఏ ప్రామిస్ చేసినా అది నిలబెట్టుకోండి.
దానివల్ల మీపై అవతలి నమ్మకం పెరుగుతుంది. అది మీలో నమ్మకాన్ని బాగా పెంచుతుంది.
అనవసరంగా బాధపడకండి.
ప్రతీ చిన్నదానికి పెద్దగా ఊహించేసుకుని బాధపడవద్దు. అనవసర ఆలోచనలు మీ ఆనందాన్ని తగ్గించి మీలో నమ్మకాన్ని పోగొడతాయి.