అమెరికాలో నవశకానికి నాంది..బైడెన్ కు కఠిన సవాళ్లు

-

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారానికి సర్వంసిద్ధమైంది. రాజధాని నగరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వాషింగ్టన్‌లోనే కాకుండా..ప్రధాన నగరాల్లో హింస చెలరేగే చాన్స్ ఉందన్న సమాచారంతో అమెరికా రాజధాని వాషింగ్టన్, డీసీ మిలటరీ కేంద్రాన్ని తలపిస్తోంది. ఇక కొత్తగా కొలువు తీరనున్న బైడెన్ టీంకు వైట్ హౌస్ లో కఠిన సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. దేశంలో అంతర్గత అల్లర్లు, ఇతర దేశాలతో వికటించిన సంబంధాలు, నిట్టనిలువుగా చీలిపోయిన సమాజం, పెట్రేగుతున్న కరోనా, చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ.. వీటన్నింటినీ జో దారిలో పెట్టాల్సి ఉంది. బైడెన్ ఈ క్లిష్ట సమస్యలు ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌ గొప్ప అధ్యక్షుడిగా మారడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడానికి కొత్త అధ్యక్షునికి, ఆయన యంత్రాంగానికి కచ్చితంగా ఇది గొప్ప అవకాశం. కరోనా తీవ్రత, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, సామాజికంగా విడిపోయిన వర్గాలు వీటిని దారిలోకి తేవడం ప్రధాన సవాళ్లు. రాజధానిపైన, ఇతర ప్రాంతాల్లో అనేక విధ్వంసాలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను చక్కదిద్ది.. సాధారణ వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయాలి.

ప్రస్తుతం అగ్రరాజ్యం చాలావరకు విడిపోయి ఉంది. రాజకీయ నాయకులు డెమోక్రటిక్‌.. రిపబ్లికన్‌ ఓటర్లుగా విడిపోయారు. వీరిమధ్య లోతైన అగాధం ఉంది. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సిద్ధాంతపరంగా తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. డెమోక్రాట్లలో విద్యావంతులు ఎక్కువగా ఉన్నారు. అసమానతలు, పర్యావరణం, అంతర్జాతీయ ఆర్థిక సాయం తదితర అంశాలను నమ్మే వైట్‌కాలర్‌ ఉద్యోగులు ఐడెంటిటీ పాలిటిక్స్‌ గురించి ఎక్కువగా మాట్లాడతారు. చట్టాన్ని నమ్మడం, గౌరవించడంతో పాటు రాజ్యాంగానికి, రాజకీయ ప్రక్రియకు విలువ ఇస్తారు.

అమెరికన్‌ కాంగ్రెస్‌, కోర్టులతో సహా అన్నింటికీ ఉన్న రాజ్యాంగపరమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం ద్వారా అన్ని వ్యవస్థలను ట్రంప్‌ ఓ పక్కకు నెట్టేశారు. వాటిని అస్తవ్యస్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్ని బైడెన్ ఎలా చక్కదిద్దుతారనే విషయం మీదే అధ్యక్షుడిగా ఆయనకు ఎన్ని మార్కులు వేయాలనేది అమెరికన్లు నిర్ణయించుకుంటారు. ప్రస్తుతం అమెరికాలో కనీవినీ ఎరుగని భద్రత ఉంది. ఒక్క వాషింగ్టన్ లోనే ఏకంగా 25 వేల మంది భద్రతా బలగాల్ని మోహరించారు. ఓ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఈ స్థాయిలో అసాధారణ భద్రత కల్పించడం అరుదు.

మొదట ఈ కల్లోల పరిస్థితి వీలైనంత త్వరగా చక్కదిద్దాలి. లేకపోతే కరోనా వ్యాక్సినేషన్ కు తీవ్ర ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికీ పలు రాష్ట్రాల రాజధానుల్లో ట్రంప్ మద్దతుదారులు చట్టసభల్ని ముట్టడిస్తున్నారు. వీళ్లందర్నీ సముదాయించడమే బైడెన్ ముందున్న అతి పెద్ద పని. మరోవైపు ఆర్థిక వ్యవస్థ కూడా అంతంతమాత్రంగా ఉంది. వీలైనంత వేగంగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం కూడా అత్యవసరమే. అలాగే ట్రంప్ అమలు చేసిన తలాతోకా లేని విధానాలన్నీ బైడెన్ తిరగదోడాల్సి ఉంటుంది. ట్రంప్ మిగిల్చిన కంపును పోగొట్టడానికే బైడెన్ కు చాలా సమయం పడుతుందనే అంచనాలున్నాయి.

ఇక అంతర్జాతీయ సంబంధాల విషయంలో కూడా గత నాలుగేళ్లలో ఏం జరిగిందనే విషయాన్ని వదిలేసి.. అంతా కొత్తగా మెదలుపెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీనికి తగ్గట్టుగానే ప్రమాణస్వీకారానికి ముందే బైడెన్ టీమ్ ప్రాధాన్యత క్రమాన్ని రూపొందించినా.. వైట్ హౌస్ కు వెళ్లాకే అసలు పని మొదలు కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news