మరో పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ : 7.5 లక్షల మందికి ఉపాధి

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టెక్స్‌టైల్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని ఆమోదించింది కేంద్రం. గ్లోబల్ టెక్స్‌టైల్స్ ట్రేడ్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని తిరిగి పొందేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం ఉపయోగపడనుంది. ఈ పథకం భారత కంపెనీలు గ్లోబల్ ఛాంపియన్‌లుగా ఎదగడానికి సహాయపడుతుందని పేర్కొంది కేంద్రప్రభుత్వం.

ఈ పథకం వల్ల 7.5 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా మరియు అనేక లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పించడంలో సహాయపడనుంది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం. ఈ పథకం పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడానికి మార్గం సుగమం చేస్తుందన్న కేంద్రం.. రూ.10,683 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ఐదేళ్లలో పరిశ్రమకు అందించబడతాయని పేర్కొంది.

ఈ పథకం వల్ల రూ. 19,000 కోట్లకు పైగా తాజా పెట్టుబడి మరియు ఐదు సంవత్సరాలలో రూ .3 లక్షల కోట్లకు పైగా అదనపు ఉత్పత్తి టర్నోవర్ లభిస్తుందని భావిస్తున్న కేంద్రం.. ఆశించిన జిల్లాలు & టైర్ 3/4 పట్టణాలలో పెట్టుబడికి అధిక ప్రాధాన్యత లభించనున్నట్లు తెలిపింది. ఈ పథకం ముఖ్యంగా గుజరాత్, యుపి, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఎపి, తెలంగాణ, ఒడిశా మొదలైన రాష్ట్రాలపై సానుకూలంగా ప్రభావం చూపుతుందని పేర్కొంది కేంద్రం.