హైదరాబాద్ పాతబస్తీ చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ శ్మశాన వాటికలో సమాధిపై ఓ మహిళా తహసీల్దార్‌పై చేతబడికి యత్నించారన్న విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బండ్లగూడలో నాలుగేళ్ళు తహసీల్దార్‌గా పనిచేసిన షేక్ ఫర్హీన్ చిత్రపతానికి క్షుద్రపూజలు చేసిన స్థలంలో ఎం అర్ ఓ ఫోటో లభ్యం కావడం పాతబస్తీలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఈనెల 17వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం బార్కాస్‌లోని బడా ఖబ్రస్తాన్లో బంధువు సమాధికి పూలు సమర్పించడానికి వెళ్ళాడు ఓ వ్యక్తి… అక్కడ సమాధిపైన క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు, ఆందోళనకరమైన వస్తువులు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆ వ్యక్తి పాతబస్తీ ఛత్రీనాకకు చెందిన చేతబడిని నిర్మూలించే వ్యక్తిగా పేరొందిన జునైద్ బక్బాబీకి విషయం తెలియజేశాడు. వెంటనే జునైద్ అక్కడికి వెళ్ళి చూడగా సమాధిపై ఉన్న విచిత్ర వస్తువులు కలిగి ఉన్న ఓ మూటను స్వాధీనం చేసుకున్నాడు.
తనతో పాటు మూటను ఇంటికి తీసుకువెళ్లిన జునైద్ ప్రత్యేక ప్రార్థనలు చేశాక.. మూటను విప్పాడు. అందులో ఒక్కొక్క వస్తువును బయటికి తీస్తుండగా దారం కట్టి మడత పెట్టిన చిత్రపటం కనిపించింది. అది విప్పగా చిత్రపటం వెనుకాల ఉర్దూ అరభిక్ భాషలో రాసిన పదాలు కనిపించాయి. ముందు భాగంలో బండ్లగూడలో నాలుగేళ్ళ పాటు తహసీల్దార్‌గా కొనసాగిన షేక్ ఫర్హీన్ చిత్రపటం కనిపించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఆ చిత్రపటం మీద కూడా నిలువు, అడ్డం గీతలు కనిపించాయి. ఉర్దూ అరబిక్ భాషలో అక్షరాలు ఉన్నాయి. ఇదంతా జునైద్ మూటను విప్పుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. ఓ మహిళా తహసీల్దార్‌పై చేతబడికి పూనుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
షేక్ ఫర్హీన్ 2018 అక్టోబర్‌లో బండ్లగూడ మండల తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2018 నుంచి 2022లో బదిలీపై ఆసిఫ్‌నగర్ మండల కార్యాలయానికి వెళ్ళారు. ఆమె బదిలీపై వెళ్ళిన ఐదు నెలల్లోనే ఇలాంటి ఘటన జరుగడం పట్ల పాతబస్తీలో తీవ్ర కలకలం రేపుతోంది. షేక్ పర్హీన్ బండ్లగూడలో తహసీల్దార్‌గా చేసిన సమయంలో అందరితో కలపుగోలుగా ఉండేదని.. ఆమెపై ఇలాంటి చర్యలకు ఎవరు? ఎందుకు పాల్పడి ఉంటారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఏదైనా స్థల వివాదంలో తహసీల్దార్‌పై పగ పెంచుకొని ఇలా చేసి ఉంటారేమో అని అనుమానిస్తున్నారు. ఆ శ్మశాన వాటిక ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తే అంతా వెలుగులోకి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ చేతబడి ఆరోపణలు విషయంలో ఇంకా చంద్రయాన్ గుట్ట పోలీసులకు ఫిర్యాదు అందలేదు.