హైదరాబాద్ లోని అంబర్పేట్ లో వీధి కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన ఘటనపై జిహెచ్ఎంసి కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అత్యవసర సమావేశం నిర్వహించారు. వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
నగరంలో కుక్కలను స్టెరిలైజ్ చేసేందుకు ప్రతిరోజు 30 వాహనాలు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలో 5.75 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు ఆమె తెలిపారు. కుక్కల కట్టడిలో భాగంగా ప్రతి వార్డులో 20 కుక్కలను దత్తత తీసుకోవడం పై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. వీధి కుక్కలకు ఆహారం అందించడం ద్వారా వాటి ఆగడాలని నిరోధించనున్నట్లు వివరించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి మునిసిపాలిటీలోనూ వీధి కుక్కల సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. దీనికోసం జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.