దేశ రాజధాని ఢిల్లీలో 2012లో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమె మరణానికి కారణమైన దోషులకు త్వరలోనే ఉరిశిక్ష పడనుంది. ఈ కేసులో ఒకడు జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడగా… ఒకడు బాల నేరస్తుడు కావడంతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మిగిలిన వారికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ మరణ శిక్ష విధించింది. ఈ కేసులో దోషులకు నెల రోజుల్లో ఉరి శిక్ష అమలు చేయనున్నారు జైలు అధికారులు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వినయ్ శర్మ అనే ఖైది…
క్షమాభిక్ష పిటీషన్ పెట్టుకోగా దీన్ని తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికి పంపించారు. కేసు తీవ్రత ఎక్కువగా ఉండటంతో లెఫ్టినెంట్ గవర్నరు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇద్దరు తిరస్కరించారు. దీనితో ఆ పిటీషన్ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు పంపగా, అది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వద్దకు రానుంది. దీనితో జాతీయ మహిళా కమీషన్… వారికి ఎలాంటి పరిస్థితుల్లోను క్షమాభిక్ష ప్రసాది౦చవద్దని కోరుతూ లేఖ రాసింది. దీనితో ఆయన తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయని అంటున్నారు.
ఈ నేపధ్యంలో జైలు అధికారులకు ఒక కష్టం వచ్చిపడింది. వారిని ఉరి తీయడానికి గాను తలారి దొరకడం లేదట. పిటీషన్ తిరస్కరణకు గురి అయిన వెంటనే… బ్లాక్ వారెంట్ జారి చేస్తారు. దీనితో ఇతర జైళ్ళలో ఎవరైనా తలారులు ఉన్నారా అనే దానిపై అధికారులు వెతుకులాట మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాల్లో ఎవరైనా మాజీ తలారులు ఉన్నారా అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఉరి తీసే తలారిని కాంట్రాక్ట్ లో నియమించుకోవాలని వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పటికే తలారి ఉంటే చెప్పాలని… ఆ మూడు రాష్ట్రాల జైళ్ళ శాఖకు తీహార్ జైలు అధికారులు అభ్యర్ధన పంపించారు. వినయ్ శర్మతోపాటు ముకేష్, పవన్, అక్షయ్ లకు మరణశిక్షను అమలు చేయనున్నారు.