విశాఖకు రాజధాని కళను తీసుకు వచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయ్. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద చేపట్టిన అభివృద్ధి పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. కొత్తగా 47కోట్ల రూపాయలతో నాలుగు రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం ఆ దిశగా చాపకింద నీరులా పని చేసుకుంటూ పోతోంది. స్మార్ట్ సిటీ కింద చేపట్టిన 50 పనులను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వేగవంతం చేసింది. 940 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధిపనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఇప్పటికే 296కోట్ల రూపాయల విలువైన 29 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 19 పనులు చురుగ్గా సాగుతున్నాయి.
టూరిజం, హెరిటేజ్ సిటీగా వున్న విశాఖ ఇప్పుడు రాజధాని కానుండటంతో రహదారుల విస్తరణ కీలకంగా మారింది. ప్రధానంగా నగరం మధ్య నుంచి వెళ్తున్న నేషనల్ హైవేను బీచ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ వీఎంఆర్డీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్ రోడ్లకు అనుమతి లభించింది. కొత్తవలస-సబ్బవరం, పెదముషిడివాడ కూడలి-ట్రైజంక్షన్, భీమిలి-తగరపువలస, రెవెన్యూనగర్-NH16ను అనుసంధానం చేస్తూ నాలుగు రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 47కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ విస్తరణ పనుల్లో రాజధాని ఏర్పడే ప్రాంతంగా ప్రచారంలో వున్న భీమిలి-తగరపువలస రోడ్డుకు ప్రాధాన్యత దక్కింది.