ఏపీలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో మరియమ్మ హత్య కేసు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్‌కు మంగళగిరి కోర్టు మరోసారి 14 రోజుల కస్టడీ విధించింది. అయితే, తనకు బెయిల్ ఇవ్వాలని మాజీ ఎంపీ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ విచారణ సందర్భంగా తమ వాదనలు వినిపించేందుకు కాస్త టైం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.
ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, గతంలో 2 సామాజిక వర్గాల మధ్య జరిగిన గొడవలో మరియమ్మ అనే మహిళ మృతి చెందగా..కూటమి ప్రభుత్వం అధికారం రాగానే వైసీపీ సర్కార్ టైంలో పెండింగ్‌లో ఉన్న కేసులపై విచారణ ప్రారంభించింది. మరియమ్మ హత్యకేసులో 78వ నిందితుడిగా ఉన్న నందిగం సురేష్‌ను చంద్రబాబు సర్కార్ అరెస్టు చేసింది. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ తెచ్చుకున్న సురేష్‌ను తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్‌తో అక్టోబర్ 7న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.