అసలు ఏ రాష్ట్రంలో అయినా.. ప్రభుత్వమే నిర్ణయాధికారి. కానీ తెలంగాణలో మాత్రం ప్రతి విషయంలో హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా జరిగాయి. మొన్నటికి మొన్న అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూలు పెడితే మన రాష్ట్రంలో మాత్రం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాతే కర్ఫ్యూ పెట్టారు.
ఇక ఏప్రిల్ 30తో కర్ఫ్యూ ముగిస్తుండటంతో మళ్లీ హైకోర్టు పదే పదే ఒత్తిడి తెచ్చింది. కర్ఫ్యూ కొనసాగిస్తారా లేదా చెప్పండి అంటూ మొట్టికాయలు వేయడంతో మళ్లీ మే8 దాకా కొనసాగిస్తున్నట్టు సీఎస్ తెలిపారు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలో కూడా హైకోర్టు ఆదేశాలు ఇస్తోంది. ఇక చచ్చినట్టు అధికారులు అమలు చేస్తున్నారు. లేదంటే డీజీపీ, హెల్త్ డైరెక్టర్ లాంటి పెద్ద ఆఫీసర్లనే హైకోర్టుకు పిలిచి మరీ చివాట్లు పెడుతోంది ధర్మాసనం.
ఇక ఈ రోజు కూడా వీకెండ్ లాక్ డౌన్ పై హైకోర్టు పదేపదే ఆదేశాలు జారీ చేస్తోంది. కర్ఫ్యూతో కేసులు తగ్గట్లేదని, వీకెండ్ లాక్ డౌన్ పెట్టాలని డీజీపీ, హెల్త్ డైరెక్టర్ ను హైకోర్టుకు పిలిచి మరీ హెచ్చరించింది. కేసులు తగ్గడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే ప్రశ్నల వర్షం కురిపించింది. టెస్టులు తగ్గిస్తే ఊరుకోబోమని మందలించింది. సరిపడా ఆక్సిజన్ పంపాలంటూ కేంద్రానికి కూడా ఆదేశాలు పంపింది. ఇప్పుడు వీకెండ్ లాక్ డౌన్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. ఇంకా విచారణ కొనసాగుతోంది.