కాంగ్రెస్ కు చావో రేవో ? రేవంత్ ముంచేనా తేల్చేనా ?

-

 

కాంగ్రెస్ స్థితి, దుస్థితి అందరికీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటనేది అందరికీ అర్థమైపోయింది. ఇప్పటి వరకూ కాస్తో కూస్తో ఆశలు ఉన్నా, ఇప్పుడు ఆ ఆశలు కాస్తా అడియాశలు అయినట్టు గా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు గా నష్ట నివారణ చర్యలకు కాంగ్రెస్ దిగుతోంది. అసలు కాంగ్రెస్ కు ఈ దుస్థితి వస్తుంది అని అంతా ముందుగానే ఊహించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం దానిని ఊహించలేక పోయినా, ఎప్పటికప్పుడు చేదు ఫలితాలు ఎదురవుతున్నా, అంతా సెట్ అయిపోతుందని, ఎప్పటికైనా మళ్లీ కాంగ్రెస్ కు పునర్వైభవం వచ్చి అధికారంలోకి వస్తామని, ఇలా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ అశలు పెంచుకుంటూ వస్తోంది. కానీ దానికి తగినట్టుగా రాజకీయ సమీకరణాలు అనుకూలించకపోవడంతో, ఎప్పటికప్పుడు ఆశలు నిరాశలు అవుతూనే వస్తున్నాయి. ఇప్పుడు దుబ్బాక ఓటమితో అయినా కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది అని ఆశలు పెట్టుకున్నా, ఓటమే పలకరించింది. ఇక గ్రేటర్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అదే సీన్ రిపీట్ అవుతుందనే అభిప్రాయాలు అందరిలోనూ ఉన్నాయి. మళ్లీ కాంగ్రెస్ కు ఈ పరిస్థితి రాకుండా చేసేందుకు ఇప్పుడు పి సి సి అధ్యక్షుడు ని మార్చాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను అధికారం వైపు నడిపించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలను, అవినీతిని బయట పెడుతూ నిరంతరం పోరాటం చేస్తున్నా, పార్టీలోని నాయకుల నుంచి సరైన సహకారం లభించకపోవడం, గ్రూపు రాజకీయాలు పెరిగి పోవడం వంటి కారణాలతో ఒక్కడే పోరాటం చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. అదే సమయంలో ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి కూడా అధిష్టానం పెద్దలు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, సీనియర్ నాయకులు మోకాలడ్డుతూ, రేవంత్ కు ఆ పదవి ఇచ్చేందుకు వీల్లేదని, సీనియర్ నాయకులు ఎవరికి ఆ పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని, కానీ రేవంత్ కు మాత్రం ఆ పదవి ఇస్తే పరిణామాలు వేరేగా ఉంటాయి అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు.

దీంతో ఎందుకు వచ్చిన తలనొప్పి అని అధిష్టానం కూడా సైలెంట్ గా ఉంటూ వస్తోంది. అయితే పార్టీ పరిస్థితి ఈ దుస్థితికి వచ్చిన తర్వాత, ఇక సీనియర్ నాయకుల మాటలను, బెదిరింపులను పక్కన పెట్టాలని, పార్టీని ఒక గాడిలో పెట్టాలంటే రేవంత్ ఒక్కడి వల్లనే అది సాధ్యం అవుతుందని కాంగ్రెస్ పెద్దలు నమ్ముతుండడం తో ఆయనకు పిసిసి పీఠం కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందుగానే ఈ పదవిని ఇవ్వడం ద్వారా, కాంగ్రెస్ కు కాస్తో కూస్తో ఊపు వస్తుందని, ఫలితాలు ఆశాజనకంగా ఉంటుంది అనే నమ్మకాన్ని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తోంది. అయితే ఒక వైపు సీనియర్ల నుంచి సరైన సహకారం లభించని పరిస్థితి, మరోవైపు ప్రజా బలం తగ్గిపోవడం, ఈ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ కాంగ్రెస్ ను అధికారం వైపు రేవంత్ ఏవిధంగా ముందుకు తీసుకెళ్తాడు అనే దానిపైన తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news