నేటి నుంచి రెండో దశ టీకా ప్రారంభం

-

హైదరాబాద్: కరోనా వైరస్ రెండో దశ టీకా పంపిణీ కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి టీకా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కొవిన్ వైబ్‌సైట్ తెరుచుకోనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఉదయం 10.30 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 48 ప్రభుత్వ ఆస్పత్రులు, 45 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవాగ్జిన్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. టీకా వేయించుకోవాలనుకునే వారు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికి మాత్రమే టీకా అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మొదట్లో 200 మంది టీకా అందించనున్నారు. మొదటివారంలో ఆన్‌లైన్‌, అడ్వాన్స్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి టీకా ఇస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద రిజిస్టర్ చేసుకున్న వారికి టీకా అందిస్తామన్నారు.

కరోనా వ్యాక్సిన్

ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కొవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు. ఏఏ కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్ సెంటర్లతో వ్యాక్సినేషన్ జరగనుంది.. వ్యాక్సినేషన్ తేదీల వివరాలు, సమయం, తదితర అంశాలను ఇప్పటికే వైద్యశాఖ వెబ్‌సైట్, యాప్‌లో పొందుపర్చింది. వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకునే వారు ఒక రోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఏర్పాట్లు చేశామని ప్రజా ఆరోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. రెండోదశ వ్యాక్సినేషన్‌లో 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారని, ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేయాలని ఆయన పేర్కొన్నారు. అందరికీ వ్యాక్సిన్ అందించాలనే దిశగా వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను పెంచామని, బాధితులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

వ్యాక్సిన్ కేంద్రాల వివరాలు..
రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇదివరకే కోవిడ్ వ్యాక్సిన్ టీకా కేంద్రాల వివరాలను విడుదల చేసింది. నగరంలోని గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రి, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, గోల్కొండ, మలక్‌పేట్, నాంపల్లి ఏరియా ఆస్పత్రులు, నిజామియా టీబీ ఆస్పత్రి, ఈఎస్ఐ మెడికల్ కళాశాల, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి, జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి, సోమాజిగూడ, సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రులు, బంజారాహిల్స్, నాంపల్లిలోని కేర్ ఆస్పత్రి, మిగిలిన ఆస్పత్రుల్లో రెండోదశ టీకా వేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version