సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఎంపిక చేసుకునే పాత్రల వల్ల వారికి మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కొన్ని పాత్రలు కొంతమందికి మాత్రమే పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాయనడంలో సందేహం లేదు. అంతేకాదు అసలు ఆ పాత్ర వారి కోసమే పుట్టిందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. అలా బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము. అలాగే రజినీకాంత్ నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాత్రకు రమ్యకృష్ణ తప్ప ఇంకొకరు సెట్ కారు అని కూడా స్పష్టం అవుతుంది.
అలా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ జీవించేసింది . ఆమె హావ భావాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి. ఇక ఆ పాత్రను వేరొకరు చేసి ఉంటే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయి ఉండేవారు కాదేమో.. అయితే ముందుగా రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణను నటిగా అనుకోలేదు. ఈ పాత్ర కోసం దర్శకుడు రవికుమార్ నగ్మాను సంప్రదించారట. ఆమెను కలసి సినిమా కథ కూడా వివరించారట . పాత్ర నచ్చినా డేట్స్ ఖాళీ లేకపోవడంతో చివరికి నగ్మా సినిమాను వదులుకుంది. ఆ తర్వాత అప్పట్లో ఒక వెలుగు వెలిగిన మీనాను కూడా దర్శకుడు సంప్రదించారు.
నిజానికి స్టార్ హీరోయిన్ గా మీనా కొనసాగుతున్నప్పటికీ అప్పట్లో ఆమె ఏ పాత్ర చేయాలన్నది ఆమె తల్లి డిసైడ్ చేసేది. అయితే మీనాకు పాత్ర నచ్చినా.. ఆమె తల్లికి నచ్చకపోవడంతో నీలాంబరి పాత్రకు మీనా కూడా దూరం అయింది. అదే సమయంలో రమ్యకృష్ణను అప్రోచ్ అవ్వడం.. ఆమె వెంటనే ఓకే చెప్పడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ చూపించిన నట విశ్వరూపం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.. ఆమె తప్ప ఇలాంటి పాత్రలు ఎవరు చేయలేరని అందరికీ స్పష్టం అయిపోయింది . ఏది ఏమైనా రమ్యకృష్ణ సినీ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ రోల్ అని చెప్పక మానరు.