తమిళనాడు సముద్ర తీర పట్టణమైన మహాబలిపురం… ఇండియాలో ఎన్నో నగరాలు, మరెన్నో చారిత్రక ప్రాంతాలూ ఉన్నప్పటికీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఈ ప్రాచీన నగరాన్ని ఇండియాలో పర్యటనకు ముఖ్య కేంద్రంగా ఎంచుకోండం విశేషంగా మారింది. తాను ఈ పట్టణాన్నే సందర్శించాలని… ఇక్కడ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవాలని జిన్‌పింగ్ భావించడం వెనక పెద్ద కారణంగా ఉంది.
ఈ పట్టణంతో చైనా దేశానికి ఎంతో అనుబంధం ఉంది. దాదాపు 1200 సంవత్సరాల క్రితం… అంటే 7, 8 శతాబ్దాల సమయంలో మహాబలిపురాన్ని పల్లవ రాజులు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పటకీ వీరి రాతి రథాలకు ఎంతో ప్రాముఖ్యతుంది. పల్లవరాజులు కుమారవర్మ, నరసింహావర్మ తమ పాలనతో ఎంతో ప్రాముఖ్యం పొందారు. వీరు మహాబలిపురాన్ని ఓ మహా నగరంగా మార్చారు. ఈ నగరానికి, చైనాకు ఓ చారిత్రక అనుబంధం ఉంది. మూడో పల్లవరాజు కుమార విష్ణువు ఎన్నో యుద్ధ విద్యల్లో, వైద్య కళల్లో నిష్ణాతుడు. ఆయన బౌద్ధమతం స్వీకరించి, ఓ పని నిమిత్తం చైనాకు వెళ్లిపోయి అక్కడే ఉండిపోతాడు.
చైనాలో ఆయన బోధి ధర్ముడు. చైనాలో బోధి ధర్ముడు ఎంతో ఆరాధ్యుడు. అక్కడి ప్రజలు నిత్యమూ ఆయన్ను పూజిస్తుంటారు. కొన్ని శతాబ్దాలు గడిచినా ఇప్పటకీ చైనాలో బోధిధర్ముడి పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. ఆయన్ను అక్కడ గుడి కట్టి పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చైనాలో వెలుగు వెలుగుతోన్న బాక్సింగ్, కున్ఫూ, కుస్తీ లాంటి క్రీడలకు బోధిధర్ముడి విద్యలే ఆధారం. ఈ కారణం చేతనే తమకు ఆరాధ్యుడైన కుమార విష్ణువు నడయాడిన ప్రాంతాన్ని తిలకించాలని భావించిన జిన్ పింగ్, మహాబలిపురాన్ని ఎంచుకున్నారు. కాగా, బోధి ధర్ముడి కథపై ఆ మధ్య సూర్య, శ్రుతి హాసన్ జంటగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో 7 సెన్స్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.