బాబ్రీ మసీదు కేసులో నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియను పూర్తి చేసింది లఖ్‌నవూలోని ప్రత్యేక సీబీఐ కోర్టు. మంగళవారం 32 మంది నింబాదితుల్లో ఒకరైన శివసేన మాజీ ఎంపీ సతీశ్ ప్రధాన్ వాంగ్మూలాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు చేసింది. రాజకీయ లబ్ధి కోసమే తనను ఈ కేసులో ఇరికించారని.. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్కే యాదవ్‌కు విన్నవించారు సతీశ్.
32 మంది నిందితుల జాబితాలో చివరి నుంచి రెండో వ్యక్తి ప్రధాన్. చివరి వ్యక్తి అయిన ప్రకాశ్ పాండే అందుబాటులో లేరు. ఆయన 15-16ఏళ్ల క్రితమే సన్యాసం తీసుకున్నారని, ఆ తర్వాత ఇంటికి రాలేదని పాండే కుటుంబసభ్యులు సీబీఐకి తెలిపారు.సుప్రీంకోర్టు ఆదేశం మేరకు… సీఆర్పీసీ సెక్షన్ 313 కింద బాబ్రీ కేసును విచారిస్తోంది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఇందులో భాగంగా గత వారం భాజపా నాయకుడు మనోహర్ జోషి, మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీ వాంగ్మూలాలను రికార్డు చేసింది సీబీఐ. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ ఆగస్టు 31న పూర్తికానుంది.