ఐదేళ్ల కొకసారి ప్రభుత్వాలు మారుతున్నా గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు. వారు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారని ఏమో కానీ ప్రభుత్వాలు వారిపై వీసమెత్తు కూడా కనికరం చూపించడం లేదు.కొన్ని గిరిజన ప్రాంతాల ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉండటానికి అక్కడ వారికి రవాణా సౌకర్యాలు లేకపోవడమే మొదటి కారణం. సరైన రోడ్లు, విద్యా వసతులు, వైద్యం లేకపోవడంతే వారు నేటికీ నానా అవస్థలు పడుతున్నారు.
ఎవరైనా మంచం పట్టినా, మరణించినా వారిని ఆస్పత్రికి తరలించాలంటే కాలినడకన కిలోమీటర్ల మేర నడవాల్సిన దుస్థితి నేటికీ నెలకొనడం నిజంగా విడ్డూరంగా ఉంది. తాజాగా విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండపర్తికి చెందిన రాజారావు అనే వ్యక్తి అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, ఆస్పత్రికి ఎలాగోలా చేరుకున్న చేరుకున్న కుటుంబసభ్యులు.. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఒక కర్రకు దుప్పట్లతో కట్టి 7 కిలోమీటర్లు కాలినడకన తీసుకెళ్లారు.ఈ దృశ్యాన్ని చూసి పలువురు చలించిపోయారు. ప్రభుత్వాలు మారినా గిరిజనుల కష్టాలు ఎప్పుడు తీరతాయని వారు ప్రశ్నిస్తున్నారు.