ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా ఓడిపోవడంతో చాలామంది నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎక్కువ సన్నిహితంగా ఉండే ఎంపీలు సుజనా చౌదరీ, సీఎం రమేష్ లు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే వీరు ఎందుకు బీజేపీలో చేరారు అనే విషయంపై చాలానే విమర్శలు వచ్చాయి. చంద్రబాబు కావాలనే వారిని బీజేపీలోకి పంపారని ఆరోపణలు ఉన్నాయి.
ఆ విమర్శలని, ఆరోపణలని పక్కనబెడితే ఏదైనా పార్టీలో ఉంటే ఆ పార్టీ లైన్ లోనే నేతలు పని చేయాలి. కానీ బీజేపీలో చేరిన దగ్గర నుంచి సుజనా, రమేష్ లు టీడీపీ నేతలుగానే ప్రవర్తిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పోలవరం, రాజధాని నిర్మాణాల విషయంలో టీడీపీ వైసీపీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ కూడా పోలవరం విషయంలో విమర్శలు చేశారు. కానీ ఈ ఇద్దరు ఎంపీలు మాత్రం బీజేపీ లైన్ దాటి టీడీపీ లైన్ లోకి వెళ్ళి వాళ్ళ మాదిరిగా విమర్శలు చేస్తూ టీడీపీ మీద మాట పడనివ్వట్లేదు.
అలాగే తాజాగా రాజధాని అమరావతి మార్పు విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నేతలు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు కానీ సుజనా మాత్రం మీడియా సమావేశం పెట్టేసే రాజధాని మారిస్తే బాగోదని జగన్ కు పెద్ద పెద్ద వార్నింగులు ఇచ్చారు. అటు సీఎం రమేష్ కూడా తాజాగా జగన్ అమెరికా పర్యటనలో ఓ సభలో జ్యోతి ప్రజ్వలన చేయకుండా హిందువులని అవమానపరిచారని ట్విట్టర్ లో పోస్ట్ చేసి, టీడీపీ నేతలగా విమర్శలు చేశారు.
ఇక నెటిజన్లు కూడా రమేష్ కి గట్టిగా బుద్ధిచెప్పారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశముండటంతో స్టేడియంలలో జ్యోతి ప్రజ్వలన చేయనివ్వరని, రమేష్ కి ఆ మాత్రం బుద్ధి లేదని చీవాట్లు పెట్టారు. ఇక ఈ ఇద్దరు నేతల తీరుపై కొందరు బీజేపీ నేతలు కూడా సీరియస్ గా ఉన్నారు. వీరు ఇంకా టీడీపీ నేతల్లాగే ప్రవర్తించడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. వీరిని త్వరగా కట్టడి చేయాలని చూస్తున్నారు. అధిస్థానానికి చెప్పి ఓ కంట కనిపెట్టాలని అనుకుంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు నేతలు కమలదళంలో పచ్చ పుష్పాలుగా ఉన్నారు.