కరోనా వల్ల దేశంలో ఎన్నో రంగాలకు తీవ్రమైన నష్టం వాటిల్లగా వాటిల్లో చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. ఎన్నో సినిమాల షూటింగ్ ఆగిపోయింది. ఫలితంగా ఎన్నో లక్షల మంది చిత్రపరిశ్రమ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఇక నిర్మాతలకైతే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. సినిమాల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియక.. అసలిప్పుడు ఏం చేయాలో పాలుపోక వారు పడుతున్న అవస్థ వర్ణనాతీతం. అయితే ఓటీటీల పుణ్యమా అని వారు కొంత వరకు నష్టాల బారి నుంచి తప్పించుకునేందుకు అవకాశం లభించింది.
ప్రస్తుతం జనాలు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడడం.. ఓటీటీ యాప్‌లలో సిరీస్, సినిమాలు ఎక్కువగా చూస్తుండడంతో.. సినీ నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ యాప్‌లలో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేస్తే తమ పరిస్థితి ఏమిటని.. థియేటర్లు, మల్టీప్లెక్సుల యాజమాన్యాలు నిర్మాతలను ప్రశ్నిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నిర్మాతలు ఆ పనిచేయక తప్పదని వారికి కూడా తెలుసు. రానున్న రోజుల్లో కరోనా ప్రభావం తగ్గితే తిరిగి యథావిధిగా థియేటర్లు, మల్టీప్లెక్సులు ప్రారంభమవుతాయి. తిరిగి ఎప్పటిలాగే వారి వ్యాపారం కూడా సాగుతుంది. అయితే కరోనా పుణ్యమా అని ఔత్సాహిక ఫిలిం మేకర్లకు, చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చేవారికి ఓటీటీ యాప్‌లు ఓ మార్గాన్ని చూపించాయి.
సాధారణంగా సినిమాను తీయడం ఒకెత్తయితే.. దాన్ని విడుదల చేయడం ఒకెత్తు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాలను చాలా తక్కువ బడ్జెట్‌తో తీసే వెసులుబాటు కలిగింది. అయితే తీసిన సినిమాలను విడుదల చేయాలంటే మాత్రం నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావాలి. అందుకు తగిన థియేటర్లు లభించాలి. అబ్బో.. అదో పెద్ద తతంగం ఉంటుంది. కానీ ఓటీటీ యాప్‌లో మూవీని రిలీజ్ చేసేందుకు ఇవేవీ అవసరం ఉండవు. చేతిలో విడుదలకు సిద్ధంగా ఉండే సినిమా ఉంటే చాలు.. ఓటీటీ యాప్ ప్రతినిధులతో రేటు మాట్లాడుకుని వెంటనే సినిమాను రిలీజ్ చేయవచ్చు. సినిమా నచ్చితే వారు ఎక్కువ మొత్తంలో ముట్టజెప్పేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఔత్సాహిక ఫిలిం మేకర్లకు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఓ చక్కని మార్గం లభిస్తుంది. మూవీలను తీసి ఓటీటీ యాప్‌లలో రిలీజ్ చేయవచ్చు. ఒక వేళ వారు విడుదల చేసే సినిమాలు హిట్ అయితే.. ఇక వారు వెను దిరిగి చూడాల్సిన పని ఉండదు. పుష్కలంగా అవకాశాలు లభిస్తాయి. సినిమా చాన్స్‌లు వెతుక్కుంటూ వస్తాయి. దీంతో వారు తమ కలలను నిజం చేసుకోవచ్చు. ఈ విధంగా ఓటీటీ యాప్‌లు ఔత్సాహిక ఫిలిం మేకర్లకు చక్కని అవకాశాన్ని అందిస్తున్నాయి.