ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఢిల్లీలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని తెలిపారు. లాక్‌డౌన్ యథావిధిగా కొనసాగుతుందన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో పలు సడలింపులు ఇవ్వాలని కేంద్రం నిర్దేశించగా.. అందుకు కేజ్రీవాల్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఢిల్లీలో ఎలాంటి సడలింపులు ఉండవని, అన్ని ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్ కొనసాగుతుందన్నారు.
కాగా దేశవ్యాప్తంగా జిల్లాలను మూడు భాగాలుగా విభజించి కరోనా తీవ్రత తక్కువగా ఉన్న చోట ఏప్రిల్ 20వ తేదీ నుంచి పలు సడలింపులు ఇవ్వాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. అయితే దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు. ఇక తదుపరి ఏప్రిల్ 27వ తేదీన మరోమారు సమీక్ష జరిపి ఆ తరువాత లాక్‌డౌన్ సడలింపుపై నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ తెలిపారు.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ సడలింపుపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. రాష్ట్రంలో నిత్యం పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేసీఆర్ లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వకుండా యథావిధిగానే లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.